మునుపటి నా మాట
ఆ మాటలు నావి కావు. మీరు ఇప్పుడిప్పుడే విన్నారే (కనులు మూసినా పాటే లో) - మన మధుర గాయని ఎస్.జానకి కల్యాణి రాగంలో మనోహరంగా ఆలపించిన పాట పల్లవి,అనుపల్లవి అవి. ఆ పాట ఎవరు వ్రాసారో – తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి. మూడు చరణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుత నిర్వచనం పలికిన మహానుభావుడు. స్నేహ బంధం అనకుండా మరుమల్లెల వంతెన అన్నాడు. దానికి కలిమి-లేమి అంతరాలు ఆనబోవన్నాడు. మల్లె,జాబిల్లి,తేనె ఇవన్నీ స్నేహం తరవాతే అని బల్ల గ్రుద్ది మరీ చెప్పాడు. ‘స్నేహం’ గురించి చెప్పమంటే ఎవరికైనా గుండె స్పందిస్తుంది. మొన్న మొన్న మన సిరివెన్నెల కవి ఏమన్నారూ? ‘స్నేహం’ అనే మాటలో చెరో అక్షరం మనం!అనేగా? అంటే స్నేహం లో ఏకాకితనం లేదు. అదో జంట. అది ఆత్మీయత, ప్రేమ కలబోస్తే పెరిగిన పంట. ‘ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో’ అన్నారు ఆత్రేయ. ‘స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం’ అన్నారు సి.నా.రె, అంతకు ముందే గుల్షన్ బావ్రా రాసిన హిందీ పాట లోని మాటలు కొంచెం అటూ ఇటూగా చెబుతూ ( ఈ రెండు పాటల వీడియోలు ‘కనులు చూసినా పాటే’ లో ఉన్నాయి). ‘స్నేహం’ కి భాషాభేదం లేదు కనుక ‘దోస్త్ మేరా దోస్త్, వాస్తవంగా దోస్త్’ అనే మాటలు సిరివెన్నెల కలబోసి ఇచ్చారు. ‘స్నేహం’కి మత భేదం లేదు కనుక సినారె -స్నేహితుడు నవ్వితే అదే రంజాన్ పండుగ అని షేర్ ఖాన్ చేత పలికించారు. స్నేహానికి రంగు-రూపు అనే భేదం లేదనిచిలక-కోయిల ల అనుబంధాన్ని కథలాగ చెప్పారు సినారె (కనులు మూసినా పాటే లో వినగలరు). ‘నీవుంటే వేరే కనులెందుకు’ అని ఆరుద్ర ఒకనాడు అన్నది ఒక బధిరుడు తన ఆవేదనని తన మిత్రుడికి వెళ్ళబోసుకోవడానికే. ‘భానునివీడని ఛాయలా నీ భావములోనే చరింతునోయి సఖా’ అని శ్రీశ్రీ స్త్రీ-పురుష స్నేహ బంధాన్ని ధైర్యంగా ప్రవచించింది చూపు కోల్పోయిన వారిని ఉద్దేశించే. స్నేహానికి హెచ్చు-తగ్గులు లేవనడానికి ‘మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ’ అని ఆటపట్టిస్తూనే ఒక మిత్రుడు తన మిత్రుడితో తన అనుబంధాన్ని చెప్పుకుంటాడు (కనులు చూసినా పాటే లో చూడవచ్చు).
2 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|